Friday, November 4, 2016

ఏపీ కాంగ్రెస్ కు మెగా షాక్

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఏదో ఒక రకంగా పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. కాపు ఉద్యమం కారణంగా మళ్లీ జవసత్వాలు నింపుకోవాలని భావించిన ఏపీ కాంగ్రెస్ నేతలు… ఆ ఉద్యమం తగ్గుముఖం పట్టడంతో డీలా పడిపోయారు. మళ్లీ ఎలాగోలా చల్లపడ్డ కాపు ఉద్యమానికి ఊపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం విజయవాడలో కాపు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు ఆ పార్టీ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్. అయితే ఈ సమావేశానికి కాపులను ఆకర్షించే కీలక నేత అయిన సినీ నటుడు చిరంజీవి రాకపోవడంపై కాంగ్రెస్ లోనే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొద్ది రోజులగా కాంగ్రెస్ నేత చిరంజీవి టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిపై కాంగ్రెస్ నేతలు వివరణ ఇస్తున్నారనే తప్ప… మెగాస్టార్ వైపు నుంచి ఈ వార్తను ఎవరూ కొట్టిపారేయడం లేదు. దీంతో చిరంజీవి అంశం ఇప్పుడు కాంగ్రెస్ నేతలకే పెద్ద తలనొప్పిగా మారిందని గుసగుసలు మొదలయ్యాయి. షూటింగ్ కారణంగానే చిరు విజయవాడ మీటింగ్ కు రాలేదని కొందరు చెబుతున్నా.. టీడీపీలో చేరే విషయంలో ఆయన నుంచి స్పందన లేదేమిటని ప్రశ్నిస్తే మాత్రం ఎవరి నుంచి సరైన సమాధానం రావడం లేదని తెలుస్తోంది. అయితే గతంలో చిరంజీవి బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయని… ప్రస్తుతం టీడీపీలో చేరతారనే న్యూస్ కూడా అలాంటిదే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా… కాపులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు మెగాస్టార్ షాక్ ఇచ్చినట్టే భావించకతప్పదు.

No comments:

Post a Comment