Wednesday, October 26, 2016

చంద్ర‌బాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి వార్నింగ్‌

ఏవోబీలో మావోయిస్టుల‌ను భారీ ఎన్‌కౌంట‌ర్ చేసిన నేప‌థ్యంలో వారు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మావోయిస్టు పార్టీ ఏపీ క‌మిటీ అధికారి ప్ర‌తినిధి శ్యామ్ పేరుతో రిలీజ్ అయిన ఓ లేఖ‌లో వారు చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుటుంబం మొత్తాన్ని చంపేందుకు అవ‌స‌ర‌మైతే ఆత్మాహుతి దాడికి కూడా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.
చంద్రబాబు నాయుడు తేనెపూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని శ్యామ్ అన్నారు.
ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు.
ఈ దారుణ‌ మారణకాండ ఫలితాన్ని ఆయ‌న త్వ‌ర‌లోనే అనుభ‌వించ‌బోతున్నార‌ని…. చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుమారుడు లోకేష్ సైతం త‌మ నుంచి త‌ప్పించుకోలేర‌ని శ్యామ్ తీవ్ర‌స్థాయి హెచ్చ‌రిక‌లు చేశారు. ఈ హ‌త్యాకాండ‌కు ప్ర‌తీకారంగా తాము ఏపీలో ప‌లువురు రాజకీయ నాయ‌కుల‌ను సైతం టార్గెట్ చేస్తామ‌ని… కోవ‌ర్డుల ద్వారా మావోయిస్టుల‌కు విషం క‌లిపిన అన్నం పంపించి..వారు ప‌డిపోయాక వారిని ప‌ట్టుకుని కాల్చి చంపేశార‌ని కూడా శ్యామ్ ఆరోపించారు.
గాయాల‌తో ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న మావోయిస్టుల‌ను వెంట‌నే విడుద‌ల చేయ‌ని ప‌క్షంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇక 2003లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు అలిపిరి దాడిలో త‌మ నుంచి త‌ప్పించుకున్నా…ఈ సారి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోను త‌ప్పించుకోర‌ని కూడా శ్యామ్ హెచ్చ‌రిక చేశారు. చంద్ర‌బాబుకు మావోయిస్టుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఏపీలో భ‌ద్ర‌తా ద‌ళాలు అలెర్ట్ అయ్యాయి.

No comments:

Post a Comment