Thursday, October 27, 2016

జగన్ అస్త్రానికి పవన్ కౌంటర్ ఇస్తాడా? కలసిపోతాడా?

ప్రత్యేక హోదా అంశం సామాన్య ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు కానీ, విద్యావంతుల్లో, యువతలో ఇది ఒక రాజకీయ అంశంగా మారింది. నవ్యాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి అంతగా లేకపోవడం, కొత్త ఉద్యోగాలు రాకపోవడం వల్ల అసంతృప్తి అయితే ఉంది. దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని జగన్, పవన్ ఇద్దరూ భావిస్తున్నారు. ఇద్దరూ పోటాపోటీగా సభలు పెడుతున్నారు. జగన్ మీద ఉన్న అవినీతి కేసులు ఒక్కటి కూడా నిరూపణ కాకపోవడంతో క్రమేణా తటస్త విద్యావంతుల్లో జగన్ పై ఉన్న వ్యతిరేకత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో జగన్, ఎంపీల రాజీనామా అస్త్రాన్ని సంధించబోతున్నాం అని ప్రకటించారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అయిపోగానే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ నిన్న కర్నూలులో ప్రకటించారు. అంటే ఏప్రిల్ లో ఎంపీల రాజీనామాలు ఉండొచ్చు. ఈ రాజీనామా అస్త్రానికి బిజెపి బెదరదు కానీ, తెదేపా డిఫెన్స్ లో పడుతుంది. ప్రత్యేక హోదా కన్నా కేంద్రం ఇచ్చిన (సారీ, ప్రకటించిన) ప్యాకేజీయే మంచిదని, తెదేపా ఊదరగొడుతుంది. అయితే, హోదా కోసం రాజీనామా చేయడం వల్ల వైకాపా ఎంపీలపై ప్రజలలో సానుభూతి వస్తుంది. ఉప ఎన్నికలు వస్తే అవి తెదేపా, వైకాపా మధ్య హోరాహోరీగా సాగడం ఖాయం. అప్పుడు పవన్ ఏం చేస్తారు అనేదే ప్రశ్న. కాకినాడ సభలో అవంతి శ్రీనివాస్ ను ఉద్దేశించి మీరు హోదా కోసం రాజీనామా చేయండి నేను మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తా అని పవన్ హామీ ఇచ్చారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయలేదు కానీ, ఇప్పుడు వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తాము అంటున్నారు. అప్పుడు పవన్ హోదా కోసం పోరాడుతున్న వైకాపా ఎంపీలకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే పవన్ జనసేన ఇమేజ్ డామేజ్ అవుతుంది. మద్దతు ఇస్తే, ఎన్నికల్లో గెలిచి ప్రత్యేక హోదా కోసం పోరాడిన క్రెడిట్ వైకాపా కొట్టేస్తుంది. ఈ పరిస్థితుల్లో పవన్ ఏం చేస్తాడో, నవంబర్ 10న అనంతపురం బహిరంగ సభలో క్లారిటీ రావచ్చు.

No comments:

Post a Comment