Monday, October 31, 2016

ఎలక్ట్రిక్ బస్సులు రెడీ

రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ప్రభుత్వ రవాణాకు సంబందించిన ఆర్టీసి బస్సుల నుండి వచ్చే పొగ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బస్సు వెళ్ళింది అంటే రోడ్డు మొత్తం నల్లటి దుప్పటిలా పొగ కమ్మేస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందికర వాతావరణ కాలుష్యాన్ని పెంపొందించే పరిస్థితులని కట్టడి చేసేందుకు విద్యుత్తు(ఎలక్ట్రిక్‌) బస్సుల పనితీరుపై అధ్యయనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.
జనవరికల్లా ప్రయోగాత్మకంగా ఒకట్రెండు బస్సులను నడపాలని యోచిస్తోంది. విద్యుత్తు బస్సుల ధర అధికమైనప్పటికీ వాటి నిర్వహణ వ్యయం తక్కువవ్వడంతో అధికారులకి సైతం దీని మీద ఆసక్తిపెరుగుతోంది. దేశంలో తొలిసారిగా బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(బీఎంటీఏ) సుమారు వందకు పైగా విద్యుత్తు బస్సులను నగర ప్రయాణికుల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిశ్చయించింది.
2014లో ఒక చైనా కంపెనీ విద్యుత్తు బస్సును ప్రయోగాత్మకంగా నడిపింది. అప్పట్లో ఒక్కో బస్సు విలువ రూ. 2.75 కోట్ల వరకు ఉండగా ప్రస్తుతం ఆధునిక బస్సుల ఖరీదు రూ.కోటి వరకూ ఉంది. తాజాగా దేశీయంగా విద్యుత్తుబస్సుల నిర్మాణానికి సైతం మార్గం సుగమం కావడంతో బీఎంటీసీ తాజాగా అదే దిశగా అడుగులు వేసే ఆలోచనలో ఉంది.
ప్రస్తుతం ఆర్టీసి నడుపుతున్న పెట్రోలు, డీజిల్‌ బస్సులతో పోలిస్తే విద్యుత్తు బస్సుల ద్వారా ఆదాయం మరింత పెరుగుతుంది అనేది బీఎంటీఏ అధ్యయనంలో స్పష్టంగా వెల్లడించింది. కాలుష్య నివారణతో పాటు వ్యయం కూడా చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖలోని అధికారుల బృందం ఈ రిపోర్టుని మరింత లోతుగా అధ్యయనం చేసిన తరువాత విద్యుత్తు బస్సును ప్రోత్సహించేందుకు కేంద్రం ముసాయిదాను సిద్ధం చేసింది. విద్యుత్తు బస్సుల బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే చాలు 250 కిలోమీటర్ల దూరం పయనిస్తుంది. వీటిని వినియోగంలోకి తీసుకువస్తే రానున్న రోజుల్లో ఎక్కువ కిలోమీటర్లు నడిచే బస్సులు తప్పక వస్తాయని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న హైదరాబాద్‌లో ఈ బస్సులను నడిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
వీటిని వినియోగంలోకి తీసుకొస్తే కాలుష్యం ఊహించనంత తగ్గుతుంది అని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ తన అధ్యయనంలో తెలిపింది. కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యుత్తు బస్సులపై రాయితీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో విద్యుత్తు బస్సులను నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. అలాగే విధ్యుత్ బుస్సులని మన నగరాలకి తెచ్చినప్పటికి వాటి బ్యాటరీ రీఛార్జింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్తు సమస్య అనేది లేదు, పైగా రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సౌకర్యం ఉన్నందున వీటిని నడపడం పెద్ద సమస్య లేదని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వి.రమణారావు వెల్లడించారు.

No comments:

Post a Comment