Thursday, October 27, 2016

‘ఏదో పొడిచేస్తాడనుకుంటే’..! ‘మిస్త్రీ’కి ఇస్త్రీ చేసింది అందుకేనట..

ఏదో పొడిచేస్తాడని అంతా అనుకున్నారు. కంపెనీని మరింత అభివృద్ది చేస్తాడని విశ్వసించారు. తమ సామ్రాజ్యాన్ని విదేశాల్లో మరింతగా విస్తరింపజేస్తాడని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులను బాగా చూసుకుంటాడని కలలు కన్నారు.. కానీ సీన్ రివర్స్ అయింది. అభివృద్ధి మాట ఏమో కాని.. ఉన్న కంపెనీని కూడా మూతపడేలా చేస్తున్నాడు. ప్రపంచం గర్వించదగ్గ కంపెనీని తల ఎత్తుకోలేని విధంగా చేశాడు. ఇలానే వదిలేస్తే మరింత డ్యామేజీ ఖాయమనే భయంతో.. వెంటనే పదవి నుంచి దింపేశారు.

టాటా… ఈ పేరు ఇండియాలోనే ఒక తిరుగులేని బ్రాండ్. టాటా ప్రొడెక్ట్ ఏదైనా సరే.. రెండు రూపాయలు ఎక్కువైనా సరే.. జనాలు కళ్లు మూసుకుని కొనేస్తారు. స్వతంత్ర భారతదేశం కంటే వయస్సులో(149 ఏళ్ల ఘన చరిత్ర) పెద్దదైన టాటా గ్రూప్ తన సుదీర్ఘ ప్రయాణంలో సాధించుకున్న అసలు లాభం దాని బ్రాండ్ వాల్యూ. దేశంలోనే ప్రముఖ వ్యాపార దిగ్గజంగా.. సకల రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ వెలుగులీనుతున్న కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్ లో అకస్మాత్తుగా తలెత్తిన పెను సంక్షోభం అందరినీ విస్మయానికి గురిచేసింది. టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగిస్తూ టాటా బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. 100 కంపెనీలతో ఆరు ఖండాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం కావడంతో సహజంగానే భారతలోనే కాకుండా విదేశాల్లోనూ టాటా గ్రూప్‌ పరిణామాలు తీవ్ర విస్మయాన్నీ, ఉత్కంఠను కలిగిస్తున్నాయి.

ఒక కార్పొరేట్‌ దిగ్గజం అత్యున్నత స్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం ముందస్తు సంకేతాలు లేకుండా ఒక్క దెబ్బతో మార్చేయడం దేశీయ కార్పొరేట్‌ రంగంలో పెను సంచలనంగా మారింది. ఈ తరహా నిర్ణయం తీసుకోవడం దేశంలో బహుశా ఇదే తొలిసారని పారిశ్రామిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇంత సడెన్ గా మిస్త్రీకి ఎందుకు ఉద్వాసన పలికారు? టాటా వారసుడిగా పగ్గాలు చేపట్టిన మిస్త్రీ ఏమంత పెద్ద తప్పు చేశాడు. నాలుగేళ్లు తిరక్కుండానే ఎందుకు ఇంటికి పంపించారు? టాటా యాజమాన్యం ఎందుకంత కంగారుగా ఉంది? అసలు ఏం జరిగింది?

ఈ వివరాల్లోకి వెళితే.. 44 ఏళ్ల వయసులోనే టాటా సన్స్ ఛైర్మన్‌ గా ఐరిష్ జాతీయుడైన సైరన్ మిస్త్రీ కీలక బాధ్యతలు చేపట్టారు. 2012 డిసెంబర్ 28న రతన్ టాటా నుంచి పగ్గాలు అందుకున్నారు. ఆ సమయంలో ఆయనకు సుదీర్ఘ కాలంపాటు అగ్ర నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వెసులుబాటు ఉండటంతో ఆయన సారథ్యంలో టాటా గ్రూప్‌ కొత్త శిఖరాలను చేరుతుందని మార్కెట్‌ పండితులు అంచనావేశారు. అయితే, అందరి అంచనాలు తారుమారయ్యాయి. మిస్త్రీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాటా గ్రూప్‌లో డజన్ల సంఖ్యలో ఉన్న కంపెనీల్లో లాభాల్లో నడుస్తున్న వాటిపై మాత్రమే ఫోకస్‌ పెడుతూ నష్టాల్లో ఉన్న సంస్థలను వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది బోర్డు పెద్దలకు ఏమాత్రం రుచించలేదు.

పైగా కొన్ని దశాబ్దాలుగా టాటా గ్రూప్‌ పాటిస్తున్న వ్యాపార విలువలు, తాత్వికతకు సైరస్‌ ధోరణి భిన్నంగా ఉంటూ వచ్చింది. కంపెనీ రుణాలు పెరగడంతో పాటు.. ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి అనేక అంశాలు మిస్త్రీ ఉద్వాసనకు దారితీశాయి.

టాటా సన్స్‌లో మెజార్టీ వాటాలు (దాదాపు 66 శాతం వాటా) టాటా ట్రస్ట్‌ల చేతుల్లో ఉన్నాయి. టాటా కుటుంబ సభ్యుల సారథ్యంలో ఉన్న ఈ ట్రస్ట్‌లు ప్రధానంగా ధార్మిక, సమాజ సేవ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నాయి. ఇందులో సర్‌ దోరబ్జీ టాటా ట్రస్ట్‌, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌‌లు అత్యంత కీలకమైనవి. ఈ ట్రస్ట్‌ల నుంచి కూడా టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తప్పించాల్సిందిగా ఒత్తిడి వచ్చిందనీ అందువల్లే ఆయనకు బోర్డు ఉద్వాసన పలికందనే వార్తలు పరిశ్రమలో వినొస్తున్నాయి.

మిస్త్రీ ఉద్వాసనకు కారణాలు..
* లాభాపేక్ష లేని వ్యాపారాల పైన మిస్త్రీ అశ్రద్ధ వహించడం, వాటిని అమ్మేయడం
* యూరప్‌ లో ఉక్కు వ్యాపారాలను విక్రయించడం
* కేవలం ఆదాయాలపై మాత్రమే శ్రద్ధ వహించడం
* ఇండియన్‌ హోటల్స్‌కు చెందిన విదేశీ ఆస్తుల విక్రయం
* యూరప్ లోని టాటాల ఉక్కు వ్యాపారాన్ని వదిలించుకునే ప్రయత్నాలు
* దయాదాక్షిణ్యాలు లేకుండా ఉద్యోగుల తొలగింపు
* అన్నింటికీ మించి టాటా డొకొమో(జపాన్) జాయింట్‌ వెంచర్‌ కు స్వస్తి సందర్భంగా తలెత్తిన లీగల్‌ వివాదం

ఆరునూరైనా వ్యాపార భాగస్వాముల ప్రయోజనాలను ఒప్పందం మేరకు కాపాడే టాటాల సంప్రదాయానికి విరుద్ధంగా జపాన్‌ సంస్థ డొకొమోతో మిస్త్రీ కయ్యానికి దిగడం, 120 కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టు ఉత్తర్వు తమకు వ్యతిరేకంగా రావడంతో రతన్‌ షాకయ్యారు. నిజానికి ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు జపాన్‌ రాయబారిని కూడా రతన్‌ కలిసారు. అయితే ఈ లోగా మిస్త్రీ ఒంటెత్తు పోకడతో పరిస్థితి చేజారింది.

ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయారు మిస్త్రీ. ఇంకా ఇలా వదిలిస్తే లాభం లేదని భావించిన టాటా యాజమాన్యం వెంటనే మిస్త్రీకి టాటా చెప్పేసింది.

ఎంతటి తప్పు చేసినా, నాయకత్వ స్థానంలో ఉన్నవారిపై అనూహ్యంగా వేటు వేయడం టాటాల సంస్కృతి కాదు. చిన్న స్థాయి ఉద్యోగి విషయంలో చర్య తీసుకోవాల్సి వచ్చినా మానవత్వంతో ఆలోచించే వరవడి ఉన్న అలాంటి గ్రూప్‌ లో లో సైరస్‌ మిస్త్రీకి ఉద్వాసన పలకడం కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

No comments:

Post a Comment