Saturday, October 22, 2016

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కొత్త ట్విస్ట్‌

త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. నిజానికి పెద్ద‌ల స‌భ‌గా పిలువ‌బ‌డే కౌన్సిల్‌లో ఒక‌ప్పుడు రాజ‌కీయ ఉద్ధండులు, వివిధ రంగాల నిపుణులు ఎక్కువ‌గా ఉండేవారు. కానీ మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిచే ప్ర‌జాబ‌లం లేక‌పోయినా, పార్టీకి ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల రాజ‌కీయ చ‌తురుల‌కు రాజ‌కీయ‌ పున‌రావాస కేంద్రంగా ఈ కౌన్సిల్ ఉప‌యోగ‌ప‌డుతోంది.


ఇక గ్రాడ్యుయేట్, టీచ‌ర్ ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాలైతే ఒక‌ప్ప‌డు క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు, కార్మిక, ఉద్యోగ‌ యూనియ‌న్ల నేత‌ల‌నుంచే ఎక్కువ‌గా పోటీప‌డేవారు. అయితే రాజ‌కీయాల్లోనూ అంత‌కంత‌కూ పెరుగుతున్న‌కార్పొరేట్ సంస్కృతికి నిద‌ర్శ‌నంగా.. ఇందులోనూ కార్పొరేట్ విద్యాసంస్థ‌ల అధినేత‌లు కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఈ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటున్నారు.
కొంత‌కాలం క్రితం ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల టీచ‌ర్ ఎమ్మెల్సీ కోసం.. ప్ర‌ముఖ కార్పొరేట్ విద్యాసంస్థ‌ల అధినేతలు ఇద్ద‌రు ఇలాగే పోటీప‌డితే టీచ‌ర్లు.. త‌మ విజ్ఞ‌త‌తో రాము సూర్యారావు ను గెలిపించి ఈ ర‌క‌మైన రాజ‌కీయాల‌పై త‌మ వ్య‌తిరేక‌త‌ను ప్రధాన పార్టీల‌కు స్ప‌ష్టంచేసి.. గ‌ట్టి గుణ‌పాఠ‌మే నేర్పార‌నుకోండి. రాము సూర్యారావు త‌న జీవిత‌మంతా ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాడిన వ్య‌క్తని అంద‌రూ గుర్తించాలి. ఈ ఉదంతం త‌రువాతైనా ప్ర‌ధాన పార్టీలు ఈ త‌ర‌హా ఎన్నిక‌ల్లో స‌చ్ఛ‌రిత్ర, చిత్త శుద్ధి క‌లిగిన వ్య‌క్తుల‌కు మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా ప్ర‌గ‌తి శీల రాజ‌కీయాల వైపు సాగుతాయ‌ని ఆశిద్ధాం.
తాజా విష‌యానికొస్తే రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస గోపాల్ రెడ్డి పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పరిధికి ఈయన పోటీ చేస్తున్నాడు. మామూలుగా అయితే గ్రాడ్యుయేట్ల, టీచర్ల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు దూరంగానే ఉంటాయి. ఇప్పుడు ఆ హ‌ద్దులు లేవు కాబ‌ట్టి తెలుగుదేశం.. ఎవ‌రిని నిలప‌బోతుందో చూడాలి
ఈ పార్టీల మద్దతు ఉన్న వారితో పాటు యూనియన్ల నేపథ్యం నుంచి వచ్చిన వారు కూడా ఈ ఎన్నికల్లో యథాతథంగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

No comments:

Post a Comment